- రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం
- గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన నేతలకు అభినందనలు
- విలీన ప్రక్రియకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించేందుకు అవసరమైతే ఆర్టీసీ భూములను అమ్ముతామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన ఈయూ కూటమి నేతలు శుక్రవారం బంజారాహిల్స్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి పొన్నంను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ నేతలను మంత్రి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మిక సంఘాల ఎన్నికలు జరిగినట్లే, త్వరలో విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల హక్కులను పరిరక్షించేందుకు ఎన్నికల ద్వారా ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం ఏర్పడాలన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
.ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో చర్చించి, భవిష్యత్లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా తగిన కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఏపీలో ఆర్టీసీ విలీన ప్రక్రియ సందర్భంగా ఎదురైన సమస్యలు తెలంగాణలో పునరావృతం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీసీఎస్ బకాయిలతోపాటు ఇతర పెండింగ్ సమస్యలను కూడా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
